బానిసత్యం నుండి భారతీయత వైపు

ఆంగ్లంలోని ప్రతి పదాన్ని కష్టపడి తెలుగులోకి తర్జుమా చేసుకుని నేర్చుకోవటం కంటే, నేరుగా ఆంగ్లంలో నేర్చుకోవటం సులువు కదా అని ఈ మధ్య ఒక ఐఏఎస్ అయ్యవారు సెలవిచ్చారు ఒక దిన పత్రికలో. తరతరాలుగా ఇంగ్లీషు వాడు ఏది చెప్తే అదే శాస్త్రంలా గుడ్డిగా చదువుకోవటానికి అలవాటు పడి, ప్రతి విషయంలోనూ ఇంగ్లీషు వాడిని అనుకరించటానికి అలవాటు పడి స్వంత బుద్ధి, సృజనాత్మకత కోల్పోయి మన సమాజం దాదాపు నిర్విర్వం అయిపోయిందంటానికి అయ్యవారి మాటలే తార్కాణం.

ఇంగ్లీషు వాడి నోట్లోనుండి ఊడిపడిన ప్రతి మాటని తెలుగులోకి తర్జుమా చేసుకుని నేర్చుకోవలసిన ఖర్మ నిజంగా తెలుగు జాతికి లేదు. తెలుగు వాళ్ళందరూ నిజంగా అంత బుర్రలేని వాళ్ళు కాదు ప్రతి ఇంగ్లీషు పదాన్ని అనువదించుకుని, దాన్ని కంఠస్థం చేసి, భాష్యం చెప్పుకోవటానికి. ఒకవేళ నిజంగా ఒక మంచి విషయం ఏదైనా ఇంగ్లీషు వాడు చెప్పాడంటే, దాన్ని అలానే మనం తీసుకోవచ్చు, ప్రతి పదాన్ని కష్టపడి తెలుగులోకి తర్జుమా చేసుకోవలసిన పని లేదు. మనం అందించిన యోగ అనే పదాన్ని ఇంగ్లీషువాడు అలానే వాడుకుంటుంటున్నాడు. వాడు ప్రత్యేకంగా దానికి ఒక పదాన్ని సృష్టించుకోలేదు. మనం కూడా అలానే చేయవచ్చు. అంతేకాని ప్రతిదానికి లేనిపోని కొత్త పదాల్ని తయారు చేసుకుని, గందరగోళం సృష్టించవలసిన పనిలేదు.

నిజానికి, ఈ ఆధునిక యుగంలో మానవాళికి అత్యంత మేలు చేకూర్చే సాధనం ఏదైనా ఈ ప్రపంచం తెలుసుకుంది అంటే అది యోగ మాత్రమే. అంతేకాని సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, రాకెట్లు, లేదా ఇంగ్లీషు మందులు కాదు. ఈ విషయంలో నిజంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభినందనీయులు. అదీ భారతీయ సంస్కృతి, భారతీయ వాజ్మయం యొక్క గొప్పతనం. యోగ లాంటి ఎన్నో అద్భుతమైన అంశాలు, మానవాళికి మేలు చేసే ఎన్నో సూత్రాలు మన ప్రాచీన వాజ్మయంలో ఉన్నాయి. మనం ప్రత్యేకంగా కొత్తగా ఆవిష్కరించవలసింది గానీ, కొత్తగా ప్రతిపాదించవలసింది కానీ ఏమి లేవు, మనకు కావాల్సిన శాస్త్రజ్ఞానమంతా అందులో నిబిడీకృతమై ఉన్నది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా జ్ఞాన సముపార్జనకు ఇంగ్లీషు భాష అవసరం లేదు. కానీ దురదృష్ట వశాత్తు, ఇంగ్లీషు చదువుల మోజులో పడి కొట్టుకుపోతున్న మనకు మన శాస్త్రాలను చదివే సమయం లేదు. వాటి గురించి కనీస అవగాహన లేదు, వాటిని అర్ధం చేసుకోవటానికి కావాల్సిన మేధాశక్తినీ, భాష నైపుణ్యాన్నీ కోల్పోయాం. ఇంకా, మన విలువైన ప్రాచీన వాఙ్మయాన్ని మత గ్రంధాలుగా ముద్ర వేసి, వాటిని విద్యార్థులు అధ్యయనం చేయటమే పాపమనుకునే దుస్థితికి మన విద్యావ్యవస్థను దిగజార్చారు మన స్వార్ధ రాజకీయ నాయకులు, కుహనా లౌకికవాదులు మరియు కుహనా హేతువాదులు.

మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవటమే కానీ మన పాలకులకు, ప్రజలకు ఇంకా బానిస మనస్తత్వం పోలేదు. మన దేశాన్ని ఇంకా ఇంగ్లీషు ప్రభువులే పరోక్షంగా పాలిస్తున్నారు. మన పాలకులు ఎప్పటికీ సామంత రాజులుగానే ఉంటారనిపిస్తుంది, ప్రజలను కూడా బానిసలుగానే ఉంచుతున్నారనిపిస్తుంది. మన రాజ్యాంగం పాశ్చాత్యుల నుండి దిగుమతి చేసుకోబడింది, మన చట్టాలు, వ్యవస్థలు అన్ని కూడా వాళ్ళ బిక్షే, పాశ్చాత్యుల నుండి మక్కికి మక్కి కాపీలే. మనకేది మంచిదో, మనమేం చేయాలో, మనమేం చదవాలో కూడా పాశ్చాత్యులను చూసి నిర్ణయించుకుంటాం, వేషభాషలన్నింటిలోను వారిని అనుకరించటానికి పోటీ పడతాం. పాశ్చాత్యం వైపు పరుగులు పెట్టే మనకు, పాశ్చాత్యులు ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ ని తలకెక్కిచుకోవటంలో తలమునకులైన మనకు మన శాస్త్రాలను చదివే సమయం ఉండదు, అనుకరణకు అలవాటు పడి, మేధాశక్తి నిర్విర్వం అయిన మనం మన సంస్కృతి, సంప్రదాయాలను, వాటి శాస్త్రీయతని ఎలా అర్ధం చేసుకోగలం? పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరిస్తూ, మన సంస్కృతి సంప్రదాయాలను వెనుకబాటుతనంగా, మూఢనమ్మకాలుగా కొట్టి పడేసే స్థాయికి భారతీయ మేధస్సు ‘ఎదిగింది’!

వేదభూమి, కర్మభూమి, సనాతన ధర్మం పుట్టిన భూమి, విశ్వగురువుగా మనం పిలుచుకునే భారతదేశానికి ఇంతటి దుస్థితి ఎలా వచ్చింది? మనకు మన శాస్త్రాలు ఎం చెప్పాయో కూడా తెలుసుకోలేని ప్రభుద్ధులం ఎందుకయ్యాం? ఒక వైపు పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరిస్తూ, మన సంస్కృతి సంప్రదాయాలను మూఢనమ్మకాలుగా కొట్టి పడేసే కుహనా హేతువాదులు; మరో వైపు పాశ్చాత్యులు ఏమైనా చెప్పగానే అది మాకు ఎప్పుడో తెలుసనీ, మా గ్రంధాల్లో ఎప్పుడో రాసారని, మా పూర్వికులు ఎప్పుడో చెప్పారని ఫోజులు కొట్టే మిధ్యా మేధావులు. పాశ్చాత్యులు భూమి గుండ్రంగా ఉందని చెప్తే మా పూర్వికులు ఎప్పుడో తేల్చారని డంబాలు పలుకుతారు, వాళ్ళు భూమి బల్లపరుపుగా ఉందని కొత్త సిద్ధాంతం ప్రవచిస్తే అదీ మా పూర్వికులు ఎప్పుడో నిర్ధారించారని గప్పాలు కొట్టుకుంటారు. ఇదీ ఇంగ్లీషు చదువులు చదువుకున్న ఆధునిక భారతీయుల యొక్క మానసిక పరిస్థితి. స్థిర చిత్తం లేదు. స్వంత ఆలోచనలు ఉండవు, సృజనాత్మకత లేదు, మన దృష్టిలో సృజనాత్మకత అంటే పాశ్చాత్యులు మనకు నేర్పిన వాటిని కొత్తగా చేయటం, వాటిని కొత్తగా అనుకరించటం.

భారతావనికి స్వతంత్రం రాకమునుపు ఈ దేశంలో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, రవీంద్ర నాథ్ టాగోర్, శ్రీనివాస రామానుజన్, సీవీ రామన్, జగదీష్ చంద్రబోస్, యెల్లప్రెగ్గడ సుబ్బారావు, మహాత్మా గాంధీ… ఇలా చాలా మంది గొప్ప తత్వవేత్తలు, సైంటిస్టులు, ప్రపంచానికి దారి చూపించిన గొప్ప నాయకులు ఉన్నారు. అంతటి మేధావంతులు, ప్రపంచం మెచ్చే ఒక మంచి సందేశం ఇచ్చినవాళ్లు, ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు మరి ఈ డెబ్భై సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఎంతమంది ఉన్నారు? ఎందుకని భారతావనికి ఈ దౌర్భాగ్యం?

మనల్నిఇంతకుముందు ఇంగ్లుషు వాళ్ళు పాలించారు, కానీ అప్పుడు మన మనసులు స్వతంత్రంగా ఉండేవి, మన ఆలోచనల్లో ఒరిజినాలిటీ ఉండేది. ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిందికాని మన మనసులు బానిసలుగా అయ్యాయి. అవి ఇంగ్లీషు వాళ్ళకి లోబడి ఆలోచిస్తున్నాయి, ఆలోచనలలోను, ఆచరణలోనూ ఇంగ్లీషు వాళ్ళని అనుకరిస్తున్నాయి. మన మూలాల్ని మనం కోల్పోయాము. భావదారిద్రం ఈ దేశాన్ని ఆవహించింది.

ఎంతదూరం పయనించినా, ఎంత కష్టపడినా, అనుకరించేవారు ఎప్పుడూ వెనుకబడే ఉంటారు, ఇతరుల నుండి నేర్చుకోవటం తప్పు కాదు, ప్రతి ఒక్కరిలోను ఎంతో కొంత మంచి ఉంటుంది, నేర్చుకునే విషయాలు ఉంటాయి, కానీ ఆ క్రమంలో మన వివేకాన్ని తాకట్టు పెట్టకూడదు, మన మూలాల్ని తెంచుకోకూడదు. వివేకాన్ని కోల్పోయి గుడ్డిగా అనుకరించటానికి పోటీ పడితే మొదటికే మోసం వస్తుంది.

ఇంగ్లీషు భాషని నేర్చుకోండి. ఇంగ్లీషు వాడు చెప్పింది అర్ధం చేసుకుని వాడికి బదులు ఇవ్వటానికి మాత్రమే ఇంగ్లీషు కావాలి. కానీ స్వతంత్రంగా ఆలోచించటానికి, స్వతంత్రమైన వ్యక్తిత్వానికి, స్వతంత్రంగా జీవించటానికి మాతృభాష కావాలి. ఆంగ్ల భాష నేర్చుకోవటం తప్పు కాదు, పరాయి భాష పరాయి మనుషులతో కనెక్ట్ అవటానికి, భావాలని పంచుకోవటానికి ఉపకరించటానికే కానీ మన మూలాల్ని తెంచేదిగా, మన పునాదుల్ని కూల్చేదిగా ఉండకూడదు. పరాయి భాష మోజులో పడి మన వేర్లని మనం తెంచుకోకూడదు. మన ఆధారాన్ని కోల్పోతే మనం ఇతరులకు బానిసలుగా, ఇతరుల మీద పరాన్నజీవుల్లా బతకవలసిన దుస్థితి వస్తుంది. మన మూలాల్ని గుర్తెరిగి, కాపాడుకుంటేనే మనం నిలబడగలుగుతాం, ఆనందంగా ఉన్నతంగా జీవించగలుగుతాం.

చివరిగా ఒక్కమాట. తెలుగు మాధ్యమంలో చదువుకుని స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో జీవించమంటే, పాశ్చాత్యుల మీద, ఇంగ్లీషు భాష మీద ద్వేషం పెంచుకొమ్మని కాదు, వాళ్ళని శత్రువులుగా చూడమని కాదు. నిజానికి ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్లకి ఇతరుల మీద ద్వేషం ఉండదు. ద్వేషం, కక్షలు, కార్పణ్యాలు ఆత్మన్యూనతకు చిహ్నాలు. మాతృభాషలో విద్యాబోధన ఒక్క తెలుగు ప్రాంత వాసులకే కాదు. ఇది ప్రతి రాష్ట్రము వారు, ప్రతి దేశం  వారు అనుసరించాల్సిన పద్దతి. దానివలన మానవ మేధస్సు నిజంగా పరిమళిస్తుంది, ప్రపంచ శాంతి నెలకొంటుంది. ఇక విదేశాల్లో ఉద్యోగాల సంగతికి వెళ్దాం.

Post a comment or leave a trackback: Trackback URL.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.