తెలుగు తల్లి ఆవేదన

“తల్లి భాష అంతరించిపోకూడదని, తెలుగు తల్లిని రక్షించాలనే తలంపుతో, మీకు భారమైనప్పటికీ, తెలుగుని ఓ పాఠ్యంశంగా ఉంచి నన్ను ఆదరిస్తున్నందుకు తెలుగు బిడ్డలందరికి ముందుగా నా కృతఙ్ఞతలు. తెలుగు చదువుకోవటం మీకు వెనుకబాటుతనంగా ఉన్నప్పటికీ, మీ ఆంగ్ల బడుల్లో నాకు ఆమాత్రం స్థానం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. 

కానీ నాదొక విన్నపం. అదేంటంటే మీరెవరూ నన్ను కాపాడటానికి లేదా నన్ను ఉద్దరించడానికి తెలుగు చదవద్దు. మీరు తెలుగు చదువుకోవాలనుకుంటే కేవలం మీ ఆనందం కోసం, మీ సంతోషం కోసం మాత్రమే తెలుగు చదవండి. కానీ నన్ను రక్షించాలని మాత్రం తెలుగు భాషని నేర్చుకోవద్దు, చదవవద్దు.

ఎందుకంటే మహాభారతాన్ని ఆంధ్రీకరించి కవిత్రయంగా ప్రసిద్ధికెక్కిన నన్నయ భట్టారకుడు, తిక్కన సోమయాజి మరియు ఎఱ్ఱాప్రెగడలు, ఇంకా ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన సహజకవి పోతనామాత్యుడు, ఆపై రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవయిత్రి మొల్ల మొదలగు వారు తమ కవితా పాండిత్యంతో నన్నెప్పుడో చిరంజీవిని చేసారు. ఆ మహాకవుల ద్వారా లభించిన భగవత్స్పర్శతో నేనెప్పుడో పునీతమయ్యాను. 

అలానే అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు లాంటి వాగ్గేయకారుల భక్తిపారవస్యంలో నుండి జాలువారిన తియ్యని కీర్తనలు నన్నెప్పుడో పావనం చేసాయి. ఇంకా వేమన పద్యాలూ, సుమతీ శతకాలు మొదలగు పద్య సంపుటాలు సరళమైన పదాలలో అపారమైన జ్ఞానసంపదని నాలో నిబిడీకృతం చేసి నన్ను ఎంతగానో సంతుష్టం గావించాయి.

తరువాత కవిసార్వభౌమ శ్రీనాధుడు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు, అష్టదిగ్గజాలుగా పేరొందిన అల్లసాని పెద్దన, ధూర్జటి, నంది తిమ్మన, తెనాలి రామలింగడు.. ఇత్యాదులు, ఇంకా పాల్కురికి సోమనాధుడు నుండి పరవస్తు చిన్నయసూరి వరకు, కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ నుండి కవికోకిల గుర్రం జాషువా వరకు.. ఇలా ఎందరో మహాకవులు తమ తమ శైలుల్లో అపారమైన పాండిత్యాన్ని పండించి నాకు ఎంతో విశిష్టతని చేకూర్చారు, నన్ను పరవశం చేసారు. ఆపైన ఎందరో ఆధునిక కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, సంగీతకారులు, గాయనీగాయకులు తమ తమ ప్రజ్ఞాపాటవాలతో నన్ను ఓలలాడించారు, నాలో వినూత్నమైన సాహిత్యాన్ని పండించి నన్ను పరిపూర్ణం చేసారు.

కనుక మీరు నా గురించి బెంగపడవద్దు. మీరు తెలుగు చదివినా, చదవక పోయినా, నా మాతృమూర్తి అయిన సంస్కృతం లాగా నేను కూడ ఈ భూప్రపంచంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాను. పరాయి సంస్కృతి మోజులో తూగుతున్న మీ చేత కాపాడబడవలసిన లేదా సంస్కరించబడవలసిన అగత్యం మీ తల్లికి లేదు. మీ చదువులు మీకు నచ్చిన ఇంగ్లీషు బాషలోనే వెలగబెట్టండి. నాకెటువంటి అభ్యంతరమూ లేదు. 

కానీ మీ శ్రేయస్సు కోరి ఒక్కమాట..

తెలుగులో చదువుకుంటే వృద్ధిలోకి రాలేము, తెలుగు భాష జీవనోపాధిని ఇవ్వలేదు అని నాపై అపవాదు వేయకండి. నాపై అబద్దపు ప్రచారం చేసి మాతృహత్యా పాతకం మూటకట్టుకోవద్దు. ఇంగ్లీషు పైత్యం మీరు తలకెక్కించుకోవటానికి పూర్వం, ఈ తెలుగు గడ్డ మీద ప్రజలు మీ ఇంగ్లీషు తరం వారి కంటే ఎన్నో రెట్లు ఆనందంగా, ప్రశాంతంగా జీవించారు. మీకంటే ఎంతో ఉన్నతంగా, పర్యావరణ హితంగా జీవించారు. 

కనుక మీరు ప్రచారం చేస్తున్నట్లు, మీ జీవనోపాధి సమస్యలకు కారణం తెలుగు మాధ్యమం కాదు. నాగరికత అనే భ్రమలో మీరు అలవర్చుకున్న మీ వికృత జీవన శైలే మీ సమస్యలకు మూల కారణం. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి వివేకాన్ని కోల్పోయిన మీరు అవసరాలకు, వ్యసనాలకు మధ్య తేడా తెలుసుకోలేక జీవనవ్యయం పెరుగుతున్నట్లు భ్రమపడతారు. లక్షల్లో, కోట్లలో ఆదాయం లేకపోతే జీవితం గడవదు అనిపిస్తుంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా చదువుకుంటారు. ఆపై సంపాదన యావలో కన్న తల్లిదండ్రులను వదిలేస్తారు, జన్మ భూమిని వదిలేస్తారు, మాతృభాషని వదిలేస్తారు. చివరికి కట్టుకున్న వాళ్ళని, కన్న పిల్లల్ని కూడా దూరం చేసుకుని జీవితాల్ని దుర్భరం చేసుకుంటారు. డబ్బు మీద వ్యామోహంతో ఇంగ్లీషు చదువులు వెలగబెడుతున్న మీరు అమ్మ ప్రేమలోని కమ్మదనం, అమ్మ భాషలోని తియ్యదనం తెలుసుకోలేరు. పాశ్చాత్య సంస్కృతి మోజులో ప్రతి విషయంలోనూ పాశ్చాత్యులను అనుకరిస్తూ వివేకాన్ని, సృజనాత్మకతని, వ్యక్తిత్వాన్ని కోల్పోయి బానిస బతుకు బతుకుతుంటారు. 

పైగా మీరేదో తెగ గొప్పగా జీవిస్తున్నామనే భ్రాంతిలో, మంచిగా అన్యోన్యంగా జీవించే అమాయక ప్రజల మీద జాలి కురిపిస్తారు. వాళ్లని ఉద్దరించడానికి కంకణం కట్టుకుంటారు. మీలాగా ఇంగ్లీషు చదువులు చదువుకుంటే వాళ్ళ జీవితాలు కూడా మీ జీవితాల్లాగా వెలిగిపోతాయని మభ్య పెడతారు. పాపం మీ పైపై మెరుగులు, హంగులు, ఆర్భాటాలు చూసి మంచిగా, ప్రశాంతంగా, అన్యోన్యంగా బతికే అమాయక జీవులు కూడా మిమ్మల్ని అనుకరించి వాళ్ళూ తమ జీవితాల్ని బలి చేసుకుంటారు. అలా అందరి బ్రతుకులు రోజురోజుకి దుర్భరంగా తయారవుతున్నాయి.

అంతేకాని మీ బతుకు భారంగా తయారవడానికి కారణం తెలుగులో విద్యాబోధన కాదు. మీరు నిజంగా తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని నమ్ముకుంటే, మీరు ఖచ్చితంగా ఆనందంగా జీవించగలుగుతారు, నలుగురికి ఆనందాన్ని పంచగలుగుతారు, సమాజానికి మార్గదర్శకులవుతారు.

కలి ప్రభావం బలీయంగా ఉన్నందున నేను చెప్పేవి ఇప్పుడు మీకు అసంబద్దంగాను, అశాస్త్రీయంగాను అనిపిస్తే అనిపించవచ్చు. కానీ, ఇంగ్లీషు చదువుల మాయలో అయినవాళ్లందరినీ పోగొట్టుకొని చివరికి దిక్కుతోచని స్థితిలో మీరు ఎదో ఒకరోజు ఈ మాతృమూర్తిని తలచుకోకపోరు. ఇంగ్లీషు భాషా పీడితులై, బాధాతప్త హృదయులైన మిమ్మల్ని అక్కున చేర్చుకుని, కొంతైనా స్వాంతన చేకూర్చటానికి ఈ తెలుగు తల్లి జీవించే ఉంటుంది.”

రాజకీయ క్రీడలో తెలుగు భాష

Post a comment or leave a trackback: Trackback URL.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.