తెలుగు వెలుగు వైపు పయనిద్దాం

అవును ప్రజలు ఆంగ్లమత్తులో తూగుతున్నారు, అదే గొప్పని భ్రమ పడుతున్నారు. దాని కోసం తహతహ లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని తెలుగు అనే వెలుగు వైపు ఎలా నడిపించడం? తెలుగు సమాజాన్ని, సంస్కృతిని ఎలా కాపాడటం?

దురదృష్టవశాత్తు ఈ ఆధునిక సమాజంలో ఎక్కువ మంది తెలుగు ప్రజలు అచ్చ తెలుగుని అర్ధం చేసుకొనే పరిస్థితి లేదు, కనుక నేను అందరికీ అర్ధం అవటానికి అక్కడక్కడా కొన్ని ఇంగ్లీషు పదాలను వాడుతున్నాను. ఒక కత్తి వల్ల అయిన గాయాన్ని నయం చేయటానికి తిరిగి కత్తితోనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అలానే ఈనాడు మన తెలుగు తల్లికి ఇంగ్లీషు భాష వల్ల అయిన గాయాన్ని నయం చేయటానికి కొన్ని ఇంగ్లీషు పదాలను వాడక తప్పటం లేదు.

ఇక విషయానికి వస్తే, మన ప్రజలను తెలుగు అనే వెలుగు వైపు ఎలా నడిపించాలి? ఇంకా పేద విద్యార్థుల అభ్యున్నతికి నిజంగా మన పాలకులు ఎం చెయ్యాలి?

ఈ రెండు లక్ష్యాలు నెరవేరాలంటే, మన ప్రభుత్వం రెండు ప్రధాన సంస్కరణలు తీసుకురావలసి ఉంటుంది.

అందులో మొదటిది, తెలుగు మీడియం నుండి వచ్చిన విద్యార్థులకు ఉన్నత విద్యలో రిజర్వేషన్ కల్పించడం. ఉదాహరణకు ఇంటర్మీడియట్లో తెలుగు మీడియం చదివిన విద్యార్థులకు మన వైద్య కళాశాలల్లో ఇరవై ఐదు శాతం మెడికల్ సీట్లు కేటాయించ వచ్చు. అలానే ఇంజనీరింగ్, ఇంకా ఇతర ఉన్నత విద్యా కోర్సెస్ లో కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ కి సీట్లు కేటాయించాలి. ఆ కోటాని ప్రతి సంవత్సరం 5శాతం పెంచుతూ 5 సంవత్సరాల్లో 50 శాతం వరకు తీసుకెళ్లవచ్చు. అఫ్ కోర్స్, ఎంత రిజర్వేషన్ కల్పిస్తే బావుంటుందో మనం అధ్యయనం చేసి నిర్ణయం చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడం కంటే, ఇప్పుడు చెప్పుకున్న ఈ తెలుగు కోటా విధానం: ‘రిజర్వేషన్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్’ అనే పాలసీ పేద విద్యార్థుల అభ్యున్నతికి ఎంతో దోహద పడుతుంది. అంతే కాకుండా తెలుగు భాషని పునరుద్దరించటానికి మహా సంజీవినిలా ఉపయోగపడుతుంది. మన సమాజంలో అతి కొద్ది కాలంలోనే విప్లవాత్మకమైన మంచి మార్పు వస్తుంది. తెలుగు మీడియం విద్యార్థులకు ఉన్నత విద్యలో కోటా కల్పించడం వలన సమాజంలో ఎటువంటి మార్పులు వస్తాయి, దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

1) ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ఇప్పటిలానే తెలుగు మీడియంలోనే విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. ఇంగ్లీష్ మీడియం భయం లేకుండా చదువుకోవచ్చు. ఉపాధ్యాయులకు అదనపు భారం ఉండదు. పిల్లలకు వచ్చి రాని ఇంగ్లీషులో అరకొర చదువులు చెప్పాల్సిన పని లేదు. ఇంగ్లీషుని ఒక పాఠ్యంశంగా మంచిగా బోధిస్తే చాలు.

2) ఇంగ్లీషు మీద మోజుతో, ఇంగ్లీషు మీడియంలో చదివే మధ్య తరగతి, ఉన్నత తరగతి పిల్లలు కూడా తెలుగు మీడియంలో బోధించే ప్రభుత్వ బడుల్లో చేరతారు. తమ పిల్లలు చదివే బడుల మీద, చదువు చెప్పే ఉపాధ్యాయుల మీద తల్లి దండ్రుల పర్యవేక్షణ ఎక్కువ అవుతుంది, శ్రద్ద పెడతారు. దాని ద్వారా ప్రభుత్వ బడుల్లో బోధన సౌకర్యాలు మెరుగవుతాయి.

3) కార్పొరేట్ పాఠశాలల్లో కూడా తెలుగు మాధ్యమం చెప్పటం మొదలు పెడతారు.

అలా ఎక్కువ మంది విద్యార్థులు మాతృభాషలో చదువు కుంటారు. పిల్లల మనోవికాసం, సృజనాత్మకత, క్రియేటివిటీ మెరుగవుతుంది, ఎక్కువ మంది మేధావంతులు తయారవుతారు. తెలుగు జాతి మేధస్సు ఇనుమడింపబడుతుంది. తెలుగు భాష, తెలుగు సంస్కృతి నిలబడతాయి.

4) తరువాత, ఇప్పడు ఉన్నటువంటి కులపరమైన రిజర్వేషన్స్ కి సమాంతరంగా ఈ తెలుగు మీడియం రిజర్వేషన్ని అమలు చేయవచ్చు. దీని వలన నిజమైన సామాజిక న్యాయం జరుగుతుంది. ఎలా అంటే, ఇప్పుడు మనకు అమల్లో ఉన్న విధానంలో బీసీ, SC, ST కులాల వారికి రిజర్వేషన్ ఉంది. ఆయా వర్గాల్లో నిజంగా వెనుకబడిన వారు తెలుగు మీడియంలో చదువుతున్నారు. వాళ్లలో ధనవంతులు, ఆల్రెడీ రిజర్వేషన్ సౌకర్యాన్ని పొంది కొంత ఉన్నత స్థితికి చేరుకున్న వాళ్ళు తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నారు.

ఇప్పుడు ఉన్న కులపరమైన రిజర్వేషన్ విధానంలో బీసీ, SC, ST వర్గాల్లో ఉన్నటువంటి ధనవంతులు, మరియు ఒకసారి రిజర్వేషన్ సౌకర్యాన్ని పొంది ఉన్నత స్థితికి చేరుకున్న వాళ్ళే ఈ రిజర్వేషన్ ఫలాలు మళ్ళీ మళ్ళీ పొందుతున్నారు. కానీ ఆయా వర్గాల్లో నిజంగా వెనుకబడిన వారికి, నిజంగా అవసరమైనవారికి ఈ రిజర్వేషన్ ఫలాలు ఆశించినంతగా అందటం లేదు. ఇది అందరూ అంగీకరించవలసిన సత్యం. ఇప్పుడు మనం చెప్పుకున్న తెలుగు మీడియం రిజర్వేషన్ పాలసీ ద్వారా రిజర్వేషన్ ఫలాలు నిజంగా ఎవరికి అవసరమో వాళ్లకి అందే అవకాశం ఉంది.

OC కేటగిరీలో కూడా, 50% వరకు సీట్లు తెలుగు మీడియం చదివిన OC విద్యార్థులకు కేటాయించవచ్చు. ఈ మధ్య ప్రవేశపెట్టిన EBC కోటా యొక్క లక్ష్యం కూడా దీని ద్వారా నేరబడుతుంది కనుక EBC కోటాని ప్రత్యేకంగా అమలు చేయవలసిన అవసరం ఉండదు.

5) ఈ తెలుగు రిజర్వేషన్ వలన ఏ వర్గం వారు కూడా ప్రత్యేకంగా ఆందోళన చెందవలసిన పని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తెలుగు బడుల్లో, తెలుగు మీడియంలో చేరవచ్చు, అలా మానసిక వికాసంతో కూడిన విద్యతో పాటు రిజర్వేషన్ ఫలాలు కూడా పొందవచ్చు. ఎవరైనా కాదు కూడదు నేను ఇంగ్లీషు మీడియం లోనే చదువుతాను, మానసిక వికాసంతో నాకు పని లేదు, తెలుగు భాష, తెలుగు జాతి మనుగడతో అంతకన్నా పని లేదు అంటే, వాళ్ళు ఈ తెలుగు గడ్డపై సౌకర్యాలు కోల్పోవలసిందే. అలాంటి వాళ్ళ కోసం ఈ తెలుగు జాతిని నిర్వీర్వం చేయటం భావ్యం కాదు.

6) చివరిగా ఈ విధానం వలన, ఉన్నత విద్యా కళాశాలల్లో, యూనివర్సిటీ ప్రాంగణాల్లో తెలుగు మీడియం విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రవేశిస్తారు. బోధనా మాధ్యమం ఇంగ్లీషు అయినప్పటికీ వాడుక భాషగా తెలుగు కొనసాగుతుంది. కనుక యూనివర్సిటీ ప్రాంగణంలో తెలుగు మీడియం నుండి వచ్చిన విద్యార్థులు చిన్న బుచ్చుకోకుండా ఆత్మ విశ్వాసంతో తిరగగలుగుతారు. చదువు మీద శ్రద్ద పెట్టగలుగుతారు.

మీరు అడగవచ్చు, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివితే, మెడికల్ కాలేజీలోనో లేక యూనివర్సిటీలోనో ప్రవేశించిన తరువాత మొత్తం అంతా ఇంగ్లీషులో చదవాలంటే కష్టం కదా? అని. ఈ వాదన కొంతవరకు నిజమే. కానీ మనం నాణేనికి మరో వైపు కూడా చూడాల్సి ఉంది.

Post a comment or leave a trackback: Trackback URL.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.