తెలుగులో ఉన్నత విద్యాభ్యాసం

ఆంగ్లంలో చదువుకోడానికి అలవాటు పడిన మన ఆధునిక సమాజానికి తెలుగు మాధ్యమంలో ఉన్నత విద్య అనే ఆలోచనే చాలా వింతగా తోస్తుంది. చాలా మందికి అసంబద్ధంగాను అనిపించవచ్చు. ముందు తెలుగు సమాజం ఈ తరహా కొయ్యబారిన మనస్తత్వం నుండి బయట పడాలి. అవును ఉన్నత విద్యని, ఉన్నపళంగా ఒక్కసారిగా తెలుగులో బోధించటం కష్టంగానే ఉండవచ్చు. కానీ చిత్తశుద్ధితో, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే అది అంత అసాధ్యమైన విషమేమి కాదని తెలుస్తుంది. ఇంకా, అనతి కాలంలోనే అద్భుతమైన ఫలాల్ని ఆస్వాదించవచ్చు. వివరాల్లోకి వెళ్లే ముందు, మాతృభాషలో విద్యా భ్యాసం వలన ప్రయోజనాలు ఏంటో ఒకసారి నెమరు వేసుకుందాం.

ముందుగా, పిల్లలు ఇంగ్లీషు భయం లేకుండా చదువుకోగలుగుతారు. ఉపాధ్యాయులు చెప్పేది బాగా అర్ధం చేసుకోగలుగుతారు. మరియు పుస్తకాల్లో ఉన్న విషయాలని మంచిగా గ్రహించగలుగుతారు. బడిలో నేర్చుకున్న వాటిని ఇంట్లో, సమాజంలో, పరిసరాల్లో తాము గమనించే విషయాలతో మంచిగా అన్వయించుకోగలుగుతారు. అలా పిల్లల మేధస్సు వికసిస్తుంది. విశ్లేషణ శక్తి మెరుగవుతుంది. మానసిక పరిపక్వత తొందరగా వస్తుంది. తరువాత, విద్యార్థులు కేవలం పరాయి ఆలోచనలను నిష్క్రియాత్మకంగా (పాసివ్) తలకెక్కించుకోకుండా, వాళ్ళు స్వంతంగా ఆలోచించగలుగుతారు. ప్రతి దాన్ని పాశ్చాత్యుల నుండి దిగుమతి చేసుకోకుండా, పాశ్చాత్యులను అనుకరించకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వంతంగా ఆవిష్కరణలు చేయగలుగుతారు. ఇంకా మాతృభాషలో పిల్లలు భావవ్యక్తీకరణ మంచిగా చేయగలుగుతారు. కనుక పిల్లలు సామాజికంగా ఉన్నతంగా ఎదుగుతారు. సమాజాభ్యుదయం జరుగుతుంది. చివరిగా, తెలుగు భాషని, సంస్కృతిని నిలబెట్టిన వాళ్ళం అవుతాం, భావితరాల వారికి విలువైన సంస్కృతిని, జ్ఞానాన్ని అందించగలుగుతాం.

శరీరధర్మ శాస్త్రం ప్రకారం మానవుల సంగ్రహణ శక్తి, విశ్లేషణా శక్తి పదిహేను నుండి ఇరవై సంవత్సరాల లోపు అత్యధిక స్థాయిలో ఉంటుంది. ఆంగ్లంలో విద్యా బోధన వలన అత్యంత కీలకమైన వయస్సంతా పర భాష మీద పట్టు సంపాదించటానికే అంకితమవుతుంది, ఎదుటివాళ్ళు ఏమి చెప్తున్నారో గ్రహించటానికే అర్పితమవుతుంది, కనుక చాలా మంది పిల్ల్లలు తమ మేధాశక్తికి పదును పెట్టే అవకాశాన్ని కోల్పోతారు, వాళ్లలో సృజనాత్మకత కొరవడుతోంది. పుస్తకాల్లో రాసినవి మూసగా అప్పచెప్ప గలుగుతారు కానీ స్వంతంగా ఆలోచించలేరు. నూతన ప్రతిపాదనలు చేయలేరు. స్వంతగా ఆవిష్కరణలు చేయలేరు. దానికి తోడు ఇంట్లో ఒక భాష, బడిలో ఒక భాష మూలంగా మెదడులో ఒక రకమైన భాషా పరమైన సంఘర్షణ తలెత్తుతుంది. చదువుకుని నేర్చుకున్న విషయాలకు, బయట గ్రహించే విషయాలకు మధ్య సమన్వయము లోపిస్తుంది. మానసిక వికాసం దెబ్బతింటుంది. విశ్లేషణా శక్తి మీద ప్రభావం చూపుతుంది. కనుక పరభాషలో విద్యాబోధన వలన విద్యార్థులు శాస్త్ర పరమైన, సాంకేతిక పరమైన అంశాల గురించి లోతుగా, స్వతంత్రంగా ఆలోచించలేరు.

తరువాత, ఉన్నత విద్య కేవలం సాంకేతిక పరిజ్ఞానం తలకెక్కించుకుని నిద్రపోటానికి కాదు లేదా విదేశీయులకి ఊడిగం చేసి డబ్బులు మూటలు కట్టుకోవటానికి కాదు. అది సమాజానికి ఉపయోగపడాలి, సామాన్య ప్రజలకు మేలు జరగాలి. ఉన్నత విద్య ద్వారా సంపాదించుకున్న జ్ఞానఫలాలు ప్రజలకు చేరాలి. అది మాతృభాషా ద్వారానే మంచిగా సాధ్యపడుతుంది. మాతృభాషలో చదువుకుంటే డాక్టర్లు, ఇంజినీర్లు చదువు అవగానే అమెరికా పరిగెత్తకుండా ఇక్కడే ఉండి సేవ చేస్తారు. ఇంకా, వైద్య విద్య తెలుగులో చదువుకుంటే, మన వైద్యులు ఇక్కడి రోగులతో, బంధువులతో బాగా మాట్లాడగలుగుతారు. వాళ్లకు బాగా అర్ధం అయ్యేలా చెప్పగలుగుతారు. అలానే లాయర్లు, కలెక్టర్లు. ఇంజినీర్లు కూడా. ఇంకా సాఫ్ట్ వేర్ విద్య తెలుగులో చదుకున్నట్లయితే, ఈ పాటికి తెలుగు భాషకి, కంప్యూటర్ రంగానికి మంచిగా అనుసంధానం జరిగి ఉండేది.

ఉన్నత విద్య ఇంగ్లీషులో ఉందని, దాని కోసం వ్యవస్థనంతా మార్చేసి, పిల్లలందరినీ మాతృభాషకు దూరం చేయటం అవివేకం. అది నాడా కోసం గుర్రాన్ని వదిలేసిన చందంగా ఉంటుంది. పిల్లల్లో సృజనాత్మకత, మానసిక వికాసం క్షీణింపజేసి, వాళ్లకి ఉన్నత విద్య ప్రసాదించడం వలన, సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కనుక ప్రాధమిక విద్యని ఇంగ్లీషులోకి మార్చి, తెలుగు సంస్కృతిని, తెలుగు సమాజం మూలాల్ని పెకలించడం కన్నా, ప్రాధమిక విద్యని తెలుగులోనే యధాతధంగా ఉంచి, ఉన్నత విద్యకి సంబంధించిన గ్రంధాలను తెలుగులోకి తర్జుమా చేయించి, ఉన్నత విద్యని కూడా తెలుగులో అందించడం ఎంతైనా సహేతుకం. ఇంకా, కేవలం తెలుగులో చదువులు కొనసాగించే అవకాశం లేక మరియు ఇంగ్లీషు భాష నేర్చుకోలేక కొంతమంది తెలివైన పిల్లలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారనేది వాస్తవం. కనుక మాతృభాషలో ఉన్నత విద్యని అందించటం వలన ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత విద్యని అభ్యసించే అవకాశం ఉంటుంది.

అవును ఉన్నత విద్యని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా తెలుగులో బోధించటం కష్టంగానే ఉండవచ్చు. కానీ చిత్తశుద్ధితో, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే అది అంత అసాధ్యమైన విషమేమి కాదని తెలుస్తుంది. ముందుగా మన ఆచార్యులు తమ తెలుగు భాష పరిజ్ఞానాన్ని కొంత పెంపొందించుకోవాల్సి ఉంటుంది. తెలుగు మాట్లాడే ఆచార్యులకు నిజంగా అది అంత కష్టమైన విషయం కాదు. తెలుగులో పాఠాలు చెప్పే మన ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి ఇంగ్లీషులో పాఠాలు చెప్పించటం కంటే, ఇంగ్లీషులో పాఠాలు చెప్పే మన యూనివర్సిటీ ఆచార్యులకు శిక్షణ ఇచ్చి, వాళ్ళ చేత తెలుగులో పాఠాలు చెప్పించటం చాలా తేలిక.

తరువాత, ఉన్నత విద్యకి సంబంధించిన పుస్తకాలను ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ప్రతి రంగంలో కొంతమంది నిపుణుల్ని తర్జుమా సహాయకులుగా నియమించుకోవచ్చు. అదొక ఉపాధిగా కూడా ఉపయోగ పడుతుంది. కొంత సాఫ్ట్ వేర్ సహకారం ఎలాగూ ఉన్నది. చిన్న చిన్న దేశాలు కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, విశ్వవిద్యాలయాల్లో బోధించే ఉన్నత గ్రంధాలను తమ తమ భాషల్లోకి తర్జుమా చేసుకోగలిగినప్పుడు, తెలుగు భాషలోకి ఎందుకు చేయకూడదు? కనుక తెలుగులో ఉన్నత విద్యాభ్యాసం అంత దుర్లభమైన విషమేమికాదు.

కొద్దికాలంలోనే, మాతృభాషలో విద్యాభ్యాసం వలన పిల్లల సృజనాత్మకత మెరుగవుతుంది. కేవలం పరాయి ఆలోచనలను నిష్క్రియాత్మకంగా (పాసివ్) తలకెక్కించుకోకుండా, వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించగలుగుతారు. ప్రతి దాన్ని పాశ్చాత్యుల నుండి దిగుమతి చేసుకోకుండా, వాళ్ళని అనుకరించకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వంతంగా ఆవిష్కరణలు చేయగలుగుతారు. వినూత్నమైన అసలు సిసలైన ప్రతిపాదనలు చేయగలుగుతారు. క్రమంగా తెలుగు జాతి మేధస్సు పరిమళిస్తుంది, మన వాళ్ళు కూడా పుస్తకాలు రాయగలుగుతారు. కొంత కాలం తరువాత మన వాళ్ళు తెలుగులో రాసిన పుస్తకాలను పాశ్చాత్యులు తర్జుమా చేసుకునే పరిస్థితి వస్తుంది.

ఇక రిఫరెన్స్ పుస్తకాలూ, జర్నల్స్… అవి నిజంగా ఎంతమందికి అవసరం? ఎంతమంది యూనివర్సిటీ చదువులు చదివే స్థాయికి వస్తారు? అంత స్థితికి వెళ్లిన వారికి కాస్తో కూస్తో ఇంగ్లీషు పరిజ్ఞానం ఉంటుంది. అది కూడా లేదనుకుంటే, కావాల్సిన వాటిని తెలుగులోకి తర్జుమా చేసే అవకాశం ఉంది. ఆ కొద్ది మంది ‘మేధావుల’ కోసం జాతి మొత్తం ఇంగ్లీషులో చదవటం ఎంత అవివేకం? అంత స్థితికి వెళ్లిన తరువాత కూడా తమంతట తాముగా నేర్చుకోలేని వాళ్ళ కోసం జాతిని నిర్వీర్యం చేయటం ఎంతవరకు సబబు? పిల్లలందరినీ సృజనాత్మక కోల్పోయేలా చేయటం ఎంత వరకు న్యాయం?

ఒకవేళ మన ప్రభువుల వారు ఉన్నత విద్యని తెలుగు భాషలో చెప్పించటం అంత కష్టమనుకుంటే, ఇప్పుడున్న పరిస్థితిని ఇలానే కొనసాగిస్తూ, పదవ తరగతి/ ఇంటర్మీడియట్ వరకు మాతృభాషలో చదువుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యలో మరియు ఉద్యోగాల్లో కొంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఆలా చేయటం ద్వారా తెలుగు జాతి నిర్వీర్యం కాకుండా కాపాడగలుగుతాం. పిల్లల్లో సృజనాత్మకతని పెంపొందించిన వాళ్లమవుతాం. తెలుగు జాతి మూలాలు కొంతైన బలపడతాయి. తెలుగు సంస్కృతి నిలబడుతుంది. భవిష్యత్తులోనైనా మన సమాజం బానిసత్వం నుండి భారతీయం వైపు పయనించి ఉన్నతంగా జీవించగలుగుతుంది.

Post a comment or leave a trackback: Trackback URL.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.