తెలుగు తల్లి ఆవేదన

“తెలుగు నేలపై ఆంగ్లానికి పట్టం కడుతున్న తెలుగు ప్రభువులకు, తెలుగు మేధావులకు, తెలుగు బిడ్డలకు ఆర్తితో, ఆవేదనతో తెలుగు తల్లి రాస్తున్న బహిరంగ లేఖ.

ముందుగా… తెలుగు మాట్లాడటం, తెలుగు చదువుకోవటం మీకు వెనుకబాటుతనం ఐనప్పటికీ, మీ రంగురంగుల ఆంగ్ల బడుల్లో తెలుగుని ద్వితీయ భాషగా కొనసాగిస్తున్నందుకు, తెలుగుని ఒక పాఠ్యంశంగా చదువుతున్నందుకు కృతఙ్ఞతలు. మాతృభాషను మృతభాష కాకుండా కాపాడటానికి తూతూమంత్రంగా అయినా మీరు చేపట్టే చర్యలకు నిజంగా ధన్యవాదాలు.

కానీ ఇక్కడ నాదొక విన్నపం. అదేంటంటే మీరెవరూ నన్ను కాపాడటానికో లేదా నన్ను ఉద్దరించడానికో తెలుగు చదవవద్దు. మీరు తెలుగు చదువుకోవాలనుకుంటే కేవలం మీ ఆనందం కోసం, మీ హితం కోసం మాత్రమే చేయండి. అంతేకాని నన్ను రక్షించాలని మాత్రం చేయవద్దు.

ఎందుకంటే మహాభారతాన్ని ఆంధ్రీకరించి కవిత్రయంగా వాసికెక్కిన నన్నయ, తిక్కన మరియు ఎఱ్ఱాప్రెగడలు; ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన సహజకవి పోతనామాత్యుడు; ఆపై రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవయిత్రి మొల్ల మొదలగు వారు తమ కవితా పాండిత్యంతో నన్నెప్పుడో చిరంజీవిని చేశారు. ఆ మహాకవుల ద్వారా లభించిన భగవత్స్పర్శతో నేనెప్పుడో పునీతమయ్యాను.

అలానే అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు లాంటి వాగ్గేయకారుల భక్తిపారవస్యం నుండి జాలువారిన తియ్యని కీర్తనలు నన్నెప్పుడో పావనం చేసాయి. ఇంకా వేమన పద్యాలూ, సుమతీ శతకాలు మొదలగు పద్య సంపుటాలు సరళమైన పదాలలో అపారమైన జ్ఞానసంపదని నాలో నిబిడీకృతం చేసి నన్ను ఎంతగానో సంతుష్టం గావించాయి. అలానే కవిసార్వభౌమ శ్రీనాధుడు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు, అష్టదిగ్గజాలుగా పేరొందిన అల్లసాని పెద్దన, ధూర్జటి, తెనాలి రామలింగడు.. ఇత్యాదులు; ఇంకా పాల్కురికి సోమనాధుడు నుండి పరవస్తు చిన్నయసూరి వరకు, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ నుండి కవికోకిల గుర్రం జాషువా వరకు… ఇలా ఎందరో మహానుభావులు తమ తమ శైలుల్లో అపారమైన పాండిత్యాన్ని పండించి నాకు ఎంతో విశిష్టతని చేకూర్చారు. ఆపైన ఎందరో ఆధునిక కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, సంగీతకారులు, గాయనీగాయకులు తమ తమ ప్రజ్ఞాపాటవాలతో నన్ను ఓలలాడించారు, నాలో వినూత్నమైన సాహిత్యాన్ని పండించి నన్ను పరిపూర్ణం చేసారు.

కనుక మీరు నా గురించి బెంగపడవద్దు. మీరు తెలుగు చదివినా, చదవకపోయినా, నా మాతృమూర్తి అయిన సంస్కృతంలా నేను కూడ ఈ భూప్రపంచంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాను. పరాయి సంస్కృతి మోజులో తూగుతున్న మీ చేత కాపాడబడవలసిన అగత్యం మీ తల్లికి లేదు. కనుక మీ కంటితుడుపు చర్యలు, కపట నాటకాలు కట్టిపెట్టి మీకు నచ్చిన ఇంగ్లీషు భాషలోనే మీ చదువులు వెలగబెట్టండి. నాకెటువంటి అభ్యంతరమూ లేదు.

కానీ మీ శ్రేయస్సు కోరి ఒక్కమాట..

తెలుగులో చదువుకుంటే వృద్ధిలోకి రాలేము, తెలుగు భాష జీవనోపాధిని ఇవ్వలేదు అని నాపై అపవాదు వేయకండి. నాపై అబద్దపు ప్రచారం చేసి మాతృహత్యా పాతకం మూటకట్టుకోవద్దు. ఇంగ్లీషు పైత్యం మీరు తలకెక్కించుకోవటానికి పూర్వం, ఈ తెలుగు గడ్డ మీద ప్రజలు మీ ఇంగ్లీషు తరం వారి కంటే ఎన్నో రెట్లు ఆనందంగా, ప్రశాంతంగా జీవించారు. మీకంటే ఎంతో ఉన్నతంగా, పర్యావరణ హితంగా జీవించారు. ఇప్పుడు కూడా మీరు నిజంగా తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని నమ్ముకుంటే, ఖచ్చితంగా ఉన్నతంగా, ఆనందంగా జీవించగలుగుతారు.

ఆధునికత మోజులో వివేకం కోల్పోయి, పరుగులు తీస్తున్న మీకు ఈ నా రోదన చెవిటివాడి ముందు శంఖం ఊదటం లాంటిదే. కానీ కుటుంబాలు విచ్చిన్నమై, అయినవాళ్లెవరూ దగ్గర లేక, చివరకి దిక్కుతోచని స్థితిలో మీరు ఎదో ఒకరోజు ఈ మాతృమూర్తిని తలచుకోకపోరు. పరభాష, పరసంస్కృతి పీడితులై, బాధాతప్త హృదయులైన మిమ్మల్ని అక్కున చేర్చుకుని, స్వాంతన చేకూర్చటానికి ఈ తెలుగు తల్లి జీవించే ఉంటుందని గుర్తుపెట్టుకోండి.”

కానీ పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి, అన్నింటా పాశ్చాత్యులను అనుకరిస్తూ; వివేకాన్ని, సృజనాత్మకతని కోల్పోయిన మీకు ఆంగ్లం లేకపోతే ముద్ద దొరకదు అనిపిస్తుంది. ఇంకా నాగరికత భ్రమలో వికృత జీవనశైలికి, వ్యసనాలకు బానిసలైన మీకు అమ్మభాష అంటే చిన్నతనం. సంపాదనే ధ్యేయంగా ఇంగ్లీషు చదువులు వెలగబెడుతున్న మీకు అమ్మ ప్రేమలోని కమ్మదనం, అమ్మ భాషలోని తియ్యదనం ఎలా తెలుస్తుంది? సంపాదన యావతో, విలువలు నేర్పని పట్టాల కోసం అమ్మభాషనే కాదు, కన్నవారిని కూడా గాలికి వదిలేస్తారు. చివరికి కట్టుకున్న వాళ్ళని, కన్న పిల్లల్ని కూడా దూరం చేసుకుని దుర్భరమైన జీవితాలు గడుపుతారు. ‘మేడిపండు చూడ మేలిమైయుండు పొట్ట విప్పిచూడ పురుగులుండు’ అన్న చందంగా మీరు పైకి సూటు బూటు వేసుకుంటారు, కానీ లోపలంతా అసంతృప్తి, అల్లకల్లోలమే. పాపం మీ పైపై మెరుగులు, హంగులు, ఆర్భాటాలు చూసి మంచిగా, ప్రశాంతంగా, అన్యోన్యంగా జీవించే అమాయక ప్రజలు కూడా దురదృష్టవశాత్తు ఇంగ్లీషు చదువులకు ఎగబడుతున్నారు. మిమ్మల్ని అనుకరించి వాళ్ళూ తమ బతుకుల్ని దుర్భరం చేసుకుంటున్నారు.

ఆధునికత మోజులో వివేకం కోల్పోయి, పరుగులు తీస్తున్న మీకు ఈ నా రోదన చెవిటివాడి ముందు శంఖం ఊదటం లాంటిదే. కానీ కుటుంబాలు విచ్చిన్నమై, అయినవాళ్లెవరూ దగ్గర లేక, చివరకి దిక్కుతోచని స్థితిలో మీరు ఎదో ఒకరోజు ఈ మాతృమూర్తిని తలచుకోకపోరు. పరభాష, పరసంస్కృతి పీడితులై, బాధాతప్త హృదయులైన మిమ్మల్ని అక్కున చేర్చుకుని, స్వాంతన చేకూర్చటానికి ఈ తెలుగు తల్లి జీవించే ఉంటుందని గుర్తుపెట్టుకోండి.”

రాజకీయ క్రీడలో తెలుగు భాష

Post a comment or leave a trackback: Trackback URL.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.