కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన!

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి ||

భగవద్గీతలోని ఈ శ్లోకం గురించి తెలియని భారతీయులు ఉండరు. కర్మయోగానికి మూలస్తంభం లాంటి ఈ శ్లోకంలో నాలుగు ముఖ్యమైన ఉపదేశాలు ఉన్నాయి.

కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూః
మా తే సంగోஉస్త్వకర్మణి

నీకు కర్మ చేయడానికి మాత్రమే అధికారం ఉంది, కర్మఫలంపై అధికారం లేదు. కర్మ ఫలానికి నువ్వు కారణం అని భావించవద్దు. అలా అని కర్మలు విడిచి పెట్టడానికి ఆసక్తి చూపకు.

ఇదీ పై శ్లోకానికి మనం సాధారణంగా వినే భాష్యం.

కానీ ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కర్మ ఫలం సంగతి పక్కన పెడితే, అసలు మనకు కర్మ చేయడంలోనైనా నిజంగా అధికారం ఉందా? ఉదాహరణకు మనకు పరీక్ష రాయటానికి అధికారం ఉంది. ఫలితంపై ఉండదు అనుకుందాం. కానీ కొన్ని సార్లు విద్యార్థులు నిజంగా పరీక్ష రాద్దామనుకున్నా రాయలేరు. పరీక్ష రాయాలనే సంకల్పం దగ్గర నుండి, మనం ఏ రోగం బారిన పడకుండా, ఏ ప్రమాదానికి గురి కాకుండా, సమయానికి పరీక్ష హాలుకి వెళ్లడం వరకు ఎక్కడైనా మనకు అడ్డంకులు కలగవచ్చు, పరీక్ష రాయలేకపోవచ్చు. అంటే ఫలితమే కాదు, పరీక్ష రాయటం అనేది కూడా పూర్తిగా మనలో చేతిలో లేదు.

అలా మనం నిజంగా చేద్దామని ప్రయత్నించినప్పటికీ, కర్మలు చేయలేని సందర్భాలు నిత్య జీవితంలో చాలా సార్లు ఎదుర్కొంటూ ఉంటాం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు, భగవంతుని అనుమతి లేనిదే మనం ఏ పని కూడా చేయలేమన్నది కాదనలేని సత్యం. కర్మ చేయటానికి మనకు మనమే స్వంతంగా సంకల్పించుకుంటామా లేక భగవంతుని ప్రేరణతోనే మనం సంకల్పించుకుంటామా? మనకు అసలు స్వతంత్రత (ఫ్రీ విల్) ఉన్నదా, లేదా?.. ఈ వేదాంత చర్చను కాసేపు పక్కన పెడితే, మనకు కర్మ ఫలంపైనే కాదు, కర్మాచరణపై కూడా నిజానికి అధికారం లేదు అనేది స్పష్టం.

మరి భగవానుడు ‘కర్మణ్యేవాధికారస్తే’ అని ఎందుకు అన్నాడు? కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది అని ఎందుకు చెప్పాడు? నిజానికి భగవంతుడు మనకు అధికారం ఉందని చెప్పలేదు. ఇక్కడ ‘అధికారం’ అనే పదానికి మనం మాములుగా చెప్పుకునే అర్ధం (అధికారం, హక్కు, అర్హత) కాకుండా ‘బుద్ధి’ లేదా ‘దృష్టి’ అనే అర్ధం తీసుకోవాల్సి ఉంటుంది.

అంటే ‘కర్మణి ఏవ అధికారః తే’ అనే వాక్యానికి ‘కర్మ యందు మాత్రమే నీ బుద్దిని ఉంచు’ అని అర్ధం చెప్పుకోవాలి. అలానే ‘మా ఫలేషు కదాచన’ అనే వాక్యానికి ‘ఫలం యందు ఎన్నడూ ఉంచకు’ అని అర్ధం తీసుకోవాలి. ‘చేసే పని మీదనే ధ్యాస పెట్టు, ఫలం గురించి ఎప్పుడూ ఆలోచించకు’ అనేది భగవానుడి సందేశం. అంతేకాని మనకు కర్మ యందు పూర్తి హక్కు/అధికారం ఉందని కాదు.

అలానే ఇక్కడ కర్మ అంటే శాస్త్రవిహిత కర్మ అని అర్ధం చేసుకోవాలి. భగవంతుడు మనల్ని కర్మలు ఆచరించమని చెప్తున్నాడు కాబట్టి మనకు ఏది తోస్తే అది చెయ్యమని కాదు. ‘కర్మణి ఏవ అధికారః తే’ అంటే ‘శాస్త్ర విహిత కర్మల యందే నీ దృష్టి పెట్టు’ అని అర్ధం చేసుకోవాలి.

తరువాత ఆ శ్లోకం చివరి వాక్యంలో భగవంతుడు ‘అకర్మణి’ అనే పదం వాడతాడు. మనం ఈ ‘అకర్మణి’ పదానికి ‘కర్మ ఆచరించకుండా ఉండుట యందు’ అని అర్ధం చెప్పుకుంటుంటాం. కానీ కర్మ అంటే శాస్త్ర విహిత కర్మ అయినప్పుడు, అకర్మ అనేది శాస్త్ర నిషిద్ధ కర్మ అవుతుంది. అలా చూస్తే ‘అకర్మణి’ పదానికి ‘నిషిద్ధ కర్మ యందు’ అని అర్ధం చెప్పుకోవాలి. కనుక శ్లోకం చివరి భాగం ‘మా తే సంగోஉస్త్వకర్మణి’ (మా తే సంగః తు అకర్మణి) అనే వాక్యానికి ‘నిషిద్ధ కర్మ యందు ఆసక్తి వద్దు’ అనే భాష్యం చక్కగా సరిపోతుంది.

ఇప్పుడు ‘కర్మణ్యే వాధికారస్తే..’ శ్లోకానికి పూర్తి అర్ధం ఒకసారి చెప్పుకుందాం.

అర్జునా! కర్మల యందు మాత్రమే నీ దృష్టిని (ఆలోచన/బుద్ది/మనస్సును) పెట్టు, ఫలితం మీద ఎప్పుడూ పెట్టకు. కర్మఫలానికి నువ్వు కారణం అని తలచకు (నేను చేయడం వల్లనే ఫలం వచ్చింది అనే అహంకారం వద్దు). అలా అని నువ్వు నిషిద్ధ కర్మయందు ఆసక్తి చూపవద్దు (కర్మ ఫలానికి నేను కారణం కాదు కదా అని శాస్త్ర విరుద్ధ కర్మల యందు నిమగ్నం కావద్దు).

ఇక్కడ మనలో చాలా మందికి ఒక సందేహం/ సంకటం ఎదురవుతుంది? కర్మ ఫలం గురించి ఆలోచించకుండా మనం అసలు కర్మలు ఆచరించగలమా?

సాధారణంగా ముందు మనం మనకు ఏమి కావాలో నిర్ణయించుకుని ఆపైన అందుకు ఏమి చేయాలో ఆలోచిస్తాం. అంటే ముందు ఫలం గురించి ఆలోచిస్తాం, ఆపైన కర్మను చేస్తాం. అంటే ఫలమే మనకు కర్మ చేయటానికి ప్రేరణ. మరి అలాంటప్పుడు ఫలం గురించి ఆలోచించకుండా కర్మను చేయమంటే మన లాంటి సామాన్య మానవులకు ఎలా సాధ్యమవుతుంది?

తప్పకుండ సాధ్యమవుతుంది. ఇది అర్ధం కావడానికి ‘అన్నం తినటం’ అనే కర్మను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అన్నం తినడం (కర్మ) వలన మనకు పని చేయటానికి కావలసిన శక్తి (ఫలం) వస్తుంది. కానీ మనం సాధారణంగా శక్తి పొందాలనే లక్ష్యంతో అన్నం తినం. మనకు అన్నం తినడం, ఆకలి తీర్చుకోవడంలో ఒక ఆనందం, ఒక తృప్తి ఉంటుంది. అందుకని మనం అన్నం తింటాం. అన్నం తింటే పని చేయటానికి కావాల్సిన శక్తి ఎలాగూ వస్తుంది, కానీ అన్నం తినడానికి అది మనకు ప్రేరణ కాదు.

మరో ఉదాహరణ— ఆటలు ఆడటం. ఆటలు ఆడితే మనకు శారీరక దృఢత్వం, ఆరోగ్యం చేకూరతాయి. కానీ వాటిని ఆశించి పిల్లలు ఆటలు ఆడరు. ఆటలు ఆడటంలో ఆనందం ఉంటుంది. అందుకని పిల్లలు ఆటలు ఆడతారు. ఆటలు ఆడితే ఆరోగ్యం, శరీర దృఢత్వం ఎలాగూ వస్తాయి. అవి వారికి అదనంగా (బోనస్) లభించే ప్రయోజనాలే కానీ వాటిని ఆశించి పిల్లలు ఆటలు ఆడరు.

ఇదే వివరణ భార్యాభర్తల దాంపత్యానికి కూడా వర్తిస్తుంది. దాంపత్యం వలన దంపతులకు సంతాన ఫలం కలుగుతుంది. కానీ సంతానం కావాలనే ధ్యేయంతో దంపతులు లైంగిక కార్యం చేయడం అసహజం. దాంపత్య క్రీడలోనే ఒక దివ్యమైన ఆనందం ఉంది. ఆ ఆనందం కోసమే భార్యాభర్తలు దాంపత్యంలో పాల్గొంటారు. సంతానం అనేది వారికి అదనపు ఫలంగా లభిస్తుంది. అలా తినడం, ఆడటం, రమించడం అనే కర్మలు మనుషులు ఎదో ఫలితాన్ని ఆశించి ఆచరించరు. ఆ కర్మలు చేయడంలోనే వారికి ఒక ఆనందం, ఒక సంతృప్తి, ఒక దివ్యానుభూతి కలుగుతాయి. కాబట్టి వారి మనస్సు/ దృష్టి కర్మాచరణ మీదనే ఉంటుంది. అంతేకాని తరవాత ఎప్పుడో వచ్చే ఫలం మీద ఉండదు.

ఇక్కడ మరొక రహస్యమైన అంశం ఉంది. మనం ఆయా కార్యాల్లోని దివ్యమైన ఆనందాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే మనం వాటిని శాస్త్రబద్ధంగా, పద్దతిగా ఆచరించాలి. ఉదాహరణకు మనం భుజించడంలోని ఆనందాన్ని మంచిగా అనుభవించాలంటే సరియైన సమయంలో సరైన ఆహారం తినాలి, మరియు మితంగా తినాలి. మనం ఈ నియమాలు పాటించకపోతే ఆనందాన్ని, సంతృప్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించే ‘భోజనం’ అనే క్రియ మనకు దుఃఖాన్ని, అసంతృప్తిని, అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

అలాగే దాంపత్య జీవనంలోని ఆనందాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే యువతి యువకులు యుక్త వయస్సులో వివాహం చేసుకుని శాస్త్రబద్ధంగా జీవించాలి. అప్పుడు వారి వైవాహిక జీవనం అత్యంత ఆనందంగా ఉండటమే కాకుండా, వారికి ప్రతిఫలంగా ఎటువంటి శ్రమ, ఖరీదైన వైద్యం అవసరం లేకుండానే మంచి సంతానం కూడా లభిస్తుంది. కానీ శాస్త్ర నిమయావళి పాటించకుండా, విపరీత పోకడలు అవలంభిస్తే, భార్యాభర్తలు సహజంగా కలిగే పిల్లలు కోసం విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది, లక్షలు లక్షలు వెచ్చించి ఆసుపత్రుల చుట్టూ తిరగవలసి వస్తుంది. కనుక కర్మాచరణలో శాస్త్ర నియమావళి అత్యంత ప్రధానం. అప్పుడే కర్మలు మనకు ఆనందాన్ని ఇస్తాయి, మనకు మంచి ఫలాలు ఇస్తాయి మరియు మనల్ని ఉద్దరిస్తాయి. అది భుజించడం కావచ్చు, ఆడటం కావచ్చు, దాంపత్యం కావచ్చు, మరోటి కావచ్చు.

అలా శాస్త్రం విధించిన ప్రతి కర్మలోను ఒక దైవికమైన ఆనందం, ఒక భగవదనుభూతి ఉంటుంది. ఆ భగవద్ అనుభూతితో కర్మలు ఆచరిస్తే కర్మ ఫలం అనేది భగవద్ప్రసాదంగా లభిస్తుంది. ఉదాహరణకు భూమి దున్నడం, విత్తడం, పైరును కాపాడటం, నూర్పిడి చేయడం.. వీటన్నిటిలో ఒక దివ్యానుభూతి ఉంటుంది. మరియు వాటిని ఆచరించడం ద్వారా మనకు మంచి ఆహారం దొరుకుతుంది, ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఈ సూత్రం వ్యవసాయంతో పాటు అన్ని వృత్తులకి వర్తిస్తుంది. శాస్త్ర బద్దంగా ఆచరిస్తే, ప్రతి వృత్తిలోనూ ఆనందం ఉంటుంది, ప్రతి వృత్తి కూడా కావలసిన జీవనోపాధిని ఇస్తుంది. కాబట్టి ప్రతి వృత్తివారు ఆనందంగా, సంతృప్తిగా జీవిస్తారు.

ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మలను ఆచరించడంలో రెండు ప్రధాన లోపాలు ఉన్నాయి. మొదటగా మనకు ఫలం మీద దృష్టి ఉంది అంటే మనం పనిలోని ఆనందాన్ని ఆస్వాదించడం లేదని అర్ధం. పనిని ఆస్వాదించలేని వాడు, దాన్ని శ్రద్దగా ఆచరించలేడు. దానిలో నైపుణ్యం సాధించలేడు. కాబట్టి వాడికి ఫలం కూడా మంచిగా దక్కదు. అంటే వాడి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది— వాడికి పని చేసేటప్పుడు ఆనందం ఉండదు, తరువాత కూడా ఆనందం లభించదు.

రెండో సమస్య… ఫలం మీద దృష్టి ఉన్నవాడు, ఎక్కువ ఫలం పొందాలనే ఆశతో పనిని అతిగా చేస్తాడు. 24 గంటలూ పనిచేసి అధిక ఫలం పొందాలని తాపత్రయ పడతాడు. దాని వలన పనిలో ఉన్న ఆనందం మాయమవుతుంది. అతిగా చేస్తే ఆటలు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఆట మనకు ఎంత నచ్చినా, మెడల్స్ కోసం రోజూ అతిగా గంటలు గంటలు ఆడితే అది కఠినంగానే అనిపిస్తుంది. అలా ఆడే ఆట ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా ఒత్తిడిని, అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. క్రీడాకారులు ఎక్కువగా ఒత్తిడికి, గుండె పోట్లకి గురవటానికి కారణం ఇదే… ఉల్లాసం కోసం ఆడాల్సిన ఆటలు వారు మెడల్స్ ఆశించి అతిగా ఆడటమే.

అలా ప్రతిఫలం ఆశించి తమ వృత్తిని అతిగా చేసేవారు ఎప్పటికీ ఆనందంగా ఉండరు. వారు ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతూ ఉంటారు. వారి వృత్తి ఎంత మంచిదైనప్పటికీ దాన్ని చాలా కష్టంగా భావిస్తారు. పైగా మిగతా వృత్తుల్లో సుఖం ఉన్నట్లు, పెద్దగా కష్టపడకుండా మంచి ప్రతిఫలం పొందవచ్చు అని భ్రమపడతారు. ఆ భ్రమలో వారు స్వధర్మాన్ని విడిచి పరధర్మాన్ని ఆశ్రయిస్తారు. అది మరింత దుఃఖానికి హేతువు అవుతుంది. ఎందుకంటే సమస్య వృత్తిలో లేదు, మన దృక్పథంలోనే ఉంది. మన ధర్మాన్నే మనం సరిగ్గా ఆచరించలేనప్పుడు, ఇక పరధర్మాన్ని ఎలా మంచిగా ఆచరించగలం? మనం మన ధర్మాన్ని మంచిగా ఆచరించగలిగితే, అందులోనే మనకు ఎంతో ఆనందం లభిస్తుంది. అప్పుడు పరధర్మం మీదకు మనసు పోదు.

శ్రీకృష్ణుడు స్వధర్మాచరణ యొక్క అవశ్యకత గురించి గీతలో ఈ విధంగా ఉటంకిస్తాడు.

శ్రేయాన్ స్వధర్మో విగుణః, పరధర్మాత్ స్వనుష్ఠితాత్!

మంచిగా నిర్వర్తించిన పరధర్మం కంటే లోపభూయిష్టంగా ఆచరించిన స్వధర్మం అనేక రెట్లు మేలు. ఎందుకంటే పరధర్మాచరణ కుటుంబాలను ముక్కలు చేస్తుంది. తల్లిదండ్రులను, పిల్లలను, అయినవాళ్ళను చెట్టుకొకరు పుట్టకొకరుగా చేస్తుంది. ఆత్మీయులను దూరం చేసుకుని సంపాదించిన ధనం, హోదాలు దుఃఖ హేతువులే కానీ ఎన్నటికీ ప్రశాంతతను ఇవ్వవు.

ధర్మబద్ధమైన జీవనం నిజానికి చాలా సరళంగా ఉంటుంది, కాబట్టి ధర్మంగా జీవించేవారికి ఎక్కువ సంపద అవసరం ఉండదు, అతిగా శ్రమించాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. అతిగా శ్రమించరు కనుక వారికి వారి వృత్తి ఒక ఆటలా తోస్తుంది. వారి జీవితం ఆనందంగా, ప్రశాంతంగా సాగుతుంది. కనుక వారు ఇతర వృత్తుల పట్ల అనవసరంగా ఆకర్షితులు కారు.

అందుకే శ్రీ కృష్ణ భగవానుడు చెప్తాడు…

యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు ।
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥ భగవద్గీత (6.17)

పనుల్లో కానీ, ఆటల్లో కానీ, ఆహారం, నిద్ర మెలఁకువల్లో కానీ సమతుల్యత అనేది చాలా ముఖ్యం. ఆ సమతుల్యత సాధిస్తే అప్పుడు ప్రతి వృత్తి దుఃఖాల్ని హరించే కర్మయోగం అవుతుంది. లేకపోతే అది మనల్ని బంధించి, బాధించే కర్మపాశం అవుతుంది. అది వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పౌరోహిత్యం కావచ్చు, పారిశుధ్యం కావచ్చు, కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు. శాస్త్ర విహితమైన కర్మాచరణ చిత్తాన్ని శుద్ధి చేసి, వివేక వైరాగ్యాలను కలిగించి, అంతిమంగా ముక్తిని కూడా ప్రసాదిస్తుంది.

లోకాః సమస్తాః సుఖినో భవంతు!

Trackbacks are closed, but you can post a comment.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.