
రామో విగ్రహవాన్ ధర్మః అని రామాయణం చెప్తుంది. అంటే రాముడు ధర్మానికి ప్రతిరూపం.
రాముడు అంత ధర్మబద్ధంగా జీవించాడు. మరి అంత ధర్మబద్ధంగా జీవించిన రాముడికి ఎందుకు అన్ని బాధలు, కష్టాలు? అని మనకు అనిపిస్తుంది. ధర్మాచరణ అంటే అలా కష్టాలు, బాధలు అనుభవించాలా? సాక్షాత్తూ పరమాత్మ అయిన రాముడే ధర్మాచరణ కోసం అన్ని కష్టాలు ఎదుర్కోవలసివస్తే మరి మనలాంటి సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? ధర్మాచరణలో వచ్చే కష్టాలు, బాధలు మనం తట్టుకోగలమా?… మనకు ఇలాంటి సందేహాలు కలుగుతుంటాయి. అలానే ధర్మం కోసం ఆనందాన్ని పణంగా పెట్టడమా లేక ఆనందం కోసం ధర్మాన్ని తప్పడమా? ఈ సంకటంలో మనం సాధారణంగా రెండో వైపే మొగ్గు చూపుతాం. దీనికి కారణం మనకు ధర్మాచరణ గురించి సరియైన అవగాహన లేకపోవడమే.
ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ధర్మాచరణ అంటే శాస్త్ర నియమాలను పాటించడం. మరోలా చెప్పాలంటే ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించడం. అటువంటి జీవనం మనకు ఇహలోకంలో సుఖసంతోషాలు ఇవ్వడమే కాకుండా, మరణానంతరం ఉన్నతి గతులను ప్రసాదిస్తుంది. అంతేకాని ధర్మం అంటే కష్టాలు మోయడం కాదు, బాధలు అనుభవించడం అంతకన్నా కాదు. నిజానికి ధర్మం వలన మాత్రమే మనం అసలైన ఆనందాన్ని పొందగలం, మంచి సుఖప్రదమైన జీవితం అనుభవించగలం. అధర్మం వలన, అనగా ప్రకృతి విరుద్ధ చేష్టల వలన, మనకు వచ్చేది కేవలం క్షణికమైన ఆనందం మాత్రమే. ఒకరకంగా చెప్పాలంటే మద్యపానం లాగా అధర్మాచరణ మనకు క్షణికమైన ఆనందం, సుఖం ఇచ్చి మనల్ని ఒక విషవలయంలోకి నెడుతుంది. కానీ ధర్మం వలన వచ్చే ఆనందం అమృతపానం లాంటిది. దానికి ‘హ్యాంగోవర్’ లాంటి దుష్ప్రభావాలు ఉండవు. ధర్మాచరణ మనకు కలుషితం లేని శుద్ధమైన ఆనందాన్ని ఇస్తుంది. నిలకడ అయిన ఆనందంతో పాటు శరీరానికి పుష్టినిస్తుంది, మరింత ధర్మాచరణకు ప్రోత్సహిస్తుంది.
మరి మన రాముడు ధర్మాచరణ చేసి కూడా ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు? నిజానికి మనం ఉహించుకున్నట్లు రాముడు అన్ని కష్టాలూ పడలేదు, అంత దుఃఖమూ అనుభవించలేదు. రాముడు పదకొండు వేల సంవత్సరాలు అయోధ్యను పాలించాడు. ఆ కాలంలో ప్రజలందరూ ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించారు. అలానే రాముడూ ఆనందంగా జీవించాడు. కాకపోతే పట్టాభిషేకానికి ముందు పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేయవలసి వచ్చింది. విలాసవంతమైన రాజభోగాలు వదిలి ఆలా 14 ఏళ్ళు వనవాసానికి వెళ్లడం మనలాంటి మనుషులకు నిజంగా చాలా బాధాకరమైన విషయమే అవుతుంది. కానీ రాముడు మహాజ్ఞాని, చిన్న వయస్సులోనే వసిష్ఠుడు వంటి మహర్షుల నుండి బ్రహ్మ జ్ఞానాన్ని పొందినవాడు. అటువంటి జ్ఞానులకు రాజభోగాలు, అధికారం వంటివి తృణప్రాయాలు. తరువాత రాముడు వంటి పరాక్రమవంతులకు వనవాసం ఒక విహారయాత్ర అవుతుంది. కాబట్టి రాముడు వనవాసం చేసి బాధలు అనుభవించాడు అనుకోవడం పొరపాటు.
ఇక పోతే తండ్రి మరణం, సీతా వియోగం, రావణ పీడ… వాటి వలన రాముడు కొంత దుఃఖాన్ని అనుభవించాడు. కానీ జ్ఞాని కాబట్టి తండ్రి మరణాన్ని అర్ధం చేసుకుని ముందుకు సాగాడు, సీతా వియోగాన్ని సహనంతో భరించాడు. ధైర్యంగా శత్రువుతో పోరాడి విజయం సాధించాడు. రాముడు కూడా కొన్ని కష్టాలు, బాధలు, సవాళ్లు ఎదుర్కొన్నాడు. కానీ వాటిని తప్పించుకోడానికి అయన ధర్మాన్ని తప్పలేదు. అదీ ముఖ్యమైన అంశం. మానవులందరు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనాల్సి ఉంటుంది. మనం కూడా భోగాల్ని వదిలి వేయాల్సిన సందర్భాలు వస్తాయి, మనకు కూడా ఆప్తుల వియోగం కలుగుతుంది. అలానే రావణుడి లాంటి పెద్ద శత్రువులు కాకపోయినా మన స్థాయిలో మనకూ శత్రువుల నుండి బాధలు తప్పవు. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే మనం జ్ఞానం సంపాదించుకోవాలి, సహనం అలవర్చుకోవాలి, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి, ధైర్యంగా పోరాడాలి. అంతేకాని కష్టాలు, బాధలు తప్పించుకోడానికి మనం అధర్మాన్ని ఆశ్రయిస్తే, అంతకు పది రెట్లు కష్టాలు, బాధలు కొనితెచ్చుకుంటాం.
స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు పక్కన ఉన్నా అర్జునుడికి కూడా కష్టాలు, బాధలు తప్పలేదు. పైగా శ్రీకృష్ణుడు అర్జునిడికి ఈ విధంగా బోధిస్తాడు..
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః।
ఆగమాపాయినోఽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత॥
అంటే సుఖదుఃఖాలు అనేవి శీతాకాలపు చలి, ఎండాకాలపు వేడిలాగా వస్తూ పోతుంటాయి. ప్రకృతిలో స్వభావ సిద్ధంగా వచ్చే వాటిని భరించమన్నాడు కానీ శ్రీకృష్ణుడు వాటిని తీసేస్తా అని చెప్పలేదు. నిజానికి కష్టాలు, బాధలు అనేవి అసలు లేకపోతే, జీవితంలో సుఖాల్ని, ఆనందాల్ని ఆస్వాదించలేం. ఏసీ యొక్క సుఖాన్ని ఆస్వాదించాలంటే మనం కనీసం అప్పుడప్పుడు ఎండలో తిరగాలి. కాబట్టి మనం జీవితంలో అప్పుడప్పుడు వచ్చే కష్టాలను, బాధలను తలుచుకుని కుమిలిపోకుండా ధైర్యంతో, సహనంతో ధర్మ మార్గంలో ముందుకు సాగాలి. అప్పుడు మన జీవితం కూడా శ్రీరాముడి జీవితంలా అధిక శాతం ఆనందంగా సాగిపోతుంది. ఆపైన పరంధామాన్ని కూడా చేరగలుగుతాం.