Monthly Archives: December 2019

ఆంగ్లంలో ఉన్నత విద్య

కొంతమంది అడగవచ్చు, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివితే, మెడికల్ కాలేజీలోనో లేక యూనివర్సిటీలోనో ప్రవేశించిన తరువాత మొత్తం అంతా ఇంగ్లీషులో చదవాలంటే కష్టం కదా? అని. ఈ వాదన కొంతవరకు నిజమే. కానీ మనం నాణేనికి మరో వైపు కూడా చూడాల్సి ఉంది. అదేంటంటే తెలివైన విద్యార్థులకు నిజంగా మీడియం అనేది పెద్ద సమస్య కాదు. వాళ్ళు చిన్నప్పటి నుండి ఇంగ్లీషు మీడియంలో చదవగలరు. లేదా చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదివి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీషు మీడియంకి ఎడ్జస్ట్ (adjust) అవగలరు,

కానీ మాతృభాషలో విద్యా బోధన లేకపోతే యావరేజ్ (average) మరియు బీలో యావరేజ్ (below average) స్టూడెంట్స్ నష్టపోతారు. తెలుగు మీడియం పుణ్యమా అని ఇప్పుడు వాళ్ళు కనీసం ఇంటర్ వరకు అయినా చదవ గలుగుతున్నాడు. అదే లేకపోతే చాలా మంది ప్రాధమిక స్థాయిలోనే  ఆగిపోయ్యే ప్రమాదం ఉన్నది. అఫ్ కోర్స్, మన టీచర్స్ అలా ఆగిపోనివ్వరు అనుకోండి. పిల్లల మీద జాలితో కొంత, ప్రభుత్వానికి స్కూల్ పెర్ఫార్మన్స్ బాగున్నట్లు చూపించాలనే తాపత్రయంతో కొంత, మన టీచర్స్ పిల్లలందర్నీ ఏదోలా మంచి మార్కులతో పాస్ చేస్తారు. కానీ అది వాపే కానీ బలుపు కాదని గ్రహించాలి.

మరో విషయం ఏంటంటే, మనం ఇంగ్లీషుని ఒక తప్పనిసరి (compulsary) సబెక్టుగా చిన్నప్పటి నుండి చదువుతాము. వ్యాకరణంతో పాటు, షేక్‌స్పియర్ లాంటి మహా మహా రైటర్స్ రాసిన కష్టమైన ప్రోజ్,ఇంకా పోయెట్రీ  చదువుతాం. కనుక పదవ తరగతి, ఇంటర్మీడియేట్ వచ్చేసరికి పిల్లలందరూ షేక్‌స్పియర్లు కాకపోయినా, సింపుల్ ఇంగ్లీషు వాక్యాలను అర్ధం చేసుకునే కనీస ప్రావీణ్యం సంపాదిస్తారు. ఇంకా ఆ వయస్సు వచ్చేసరికి పిల్లలకు కొంత మానసిక పరిపక్వత (mental maturity) వస్తుంది.

కనుక పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సైన్సు, ఎకనామిక్స్, హిస్టరీ లాంటివి ఇంగ్లీషులో చదివి అర్ధం చేసుకోవటం అంత కష్టం కాకూడదు. అవి చాలా సింపుల్ టెన్స్ లో, సరళమైన భాషలో ఉంటాయి. వాటిని చదవటానికి ఇంగ్లీషు మీద విపరీతమైన పట్టు అవసరం లేదు. కాకపోతే కొంచం పదజాలం (vocabulary) మెరుగు పరుచుకోవాల్సి ఉంటుంది, అంతే. పదేళ్లకు కూడా ఆ మాత్రం ఇంగ్లీషు పరిజ్ఞానం రాలేదంటే, ఉపాధ్యాయులన్నా సరిగా చెప్పట్లేదు లేదా మన పిల్లలకు అంత ప్రతిభ లేదని, వాళ్ళు చదువుల్లో రాణించలేరని అనుకోవాలి.

అఫ్ కోర్స్ చదువు రానంత మాత్రాన పిల్లలకు ప్రతిభ లేదని కాదు, వాళ్ళు పనికిరారని కాదు. If you judge a fish by its ability to climb a tree, it will live its whole life thinking that it is stupid. అంటే చెట్టు ఎక్కే సామర్ధ్యాన్ని బట్టి ఒక చేప పిల్ల ప్రతిభని నిర్ణయిస్తే, అది తన జీవితమంతా తను ఒక పనికిరాని చవటననే భ్రమలోనే బతుకుతుంది. చెట్టు ఎక్కలేని జీవులన్నీ చవటలు కాదు. కొన్నిటికి ఈదటంలో ప్రతిభ ఉంటుంది. అలానే చదువు రాని పిల్లలందరూ చవటలు కాదు. ప్రతి ఒక్కరిలోనూ సహజ సిద్దమైన ప్రతిభ ఎదో ఒకటి ఉంటుంది. చదువుల్లో రాణించనంత మాత్రాన పిల్లలకు తెలివి తేటలు, ప్రతిభ లేవని కాదు. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప మేధావులు, శాస్త్రవేత్తలు, కళాకారులు, వ్యాపారవేత్తలు చదువుల్లో రాణించలేదు. ఇంకా ఎంతో మంది ఎంట్రప్రెన్యూర్స్ తమ చదువుల్ని కట్టిపెట్టి తమకి ఆసక్తి ఉన్న రంగంలోకి దూకి, ప్రపంచానికి తమ సత్తా చాటారు.

నిజానికి మనుషులు అందరూ, తమ ఆసక్తులను పక్కనపెట్టి, చదివి డిగ్రీలు తెచ్చుకుంటే, మానవ జాతి ఎప్పుడో పూర్తిగా నిర్వీర్యం అయిపోయేది. మన మూస చదువుల వల్ల ఎంతో మానవ మేధస్సు వృధా అవుతుందంటే అతిశయోక్తి కాదు. గొప్పగా ఎదగాలంటే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి, మన పరిస్థితుల్ని అంచనా వేసుకోవాలి. మన ఆసక్తి ఏంటో మనం గ్రహించాలి. మనకు దేనిమీద ఆసక్తి ఉంటే అందులో మనకు మంచి ప్రతిభ కూడా ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులు అది గ్రహించి ముందుకు వెళ్ళాలి. అంతే కానీ గుడ్డిగా, అందరూ చదువుకుంటున్నారు, లేదా ఎదో చేస్తున్నారు కనుక మనమూ అలానే చదవాలి, అలానే చెయ్యాలి అనుకుంటే మనకి మనమే ద్రోహం చేసుకున్నవాళ్ళం అవుతాం.

అవును నిజమే, కొంతమంది విద్యార్థులకు ఇంటర్ వరకు తెలుగు మాధ్యమంలో చదివి, తరువాత ఉన్నత విద్య ఇంగ్లీషు మాధ్యమంలో చదవటం కష్టంగానే ఉండవచ్చు. దానికి సమాధానం తెలుగు వారందరు చిన్నప్పటి నుండి ఇంగ్లీషు మాధ్యమంలో చదవటమేనా? వేరే మార్గం లేదా? అసలు ఉన్నత విద్యని తెలుగు మాధ్యమంలో ఎందుకు చదవకూడదు? ఆలా మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు? మన విద్యావ్యవస్థని ఎందుకు సంస్కరించకూడదు?