రాజకీయ క్రీడలో తెలుగు భాష

ఆంధ్రదేశంలో బోధనామాధ్యమం మీద జరుగుతున్న రగడ తెలుగు వారందరికీ తెలిసే ఉంటుంది. ఒక పక్క ప్రభుత్వ బడులన్నింటిలోను ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తుండగా, మరోపక్క చాలామంది ప్రముఖులు, భాషాభిమానులు, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విచిత్రం ఏంటంటే వ్యతిరేకించే ప్రముఖులందరూ దాదాపు తమ పిల్లల్ని చిన్నప్పటి నుండి ఆంగ్ల మాధ్యమంలోనే చదివిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ బడుల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయం సబబేనేమో అనిపిస్తుంది. ప్రముఖుల పిల్లలు/ మనవళ్లు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు, మరి అలాంటప్పుడు ప్రభుత్వ బడుల్లో చదివే సామాన్యుల పిల్లలు తెలుగు మాధ్యమంలో ఎందుకు చదవాలి అన్న ప్రశ్న సమంజసమే అనిపిస్తుంది.

కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేశానికి ఆదర్శం రామోజీరావు గారి మనవళ్లు, జగన్మోహన్ రెడ్డి గారి కొడుకులు లేదా డా. శ్రీనివాసరావు గారి పిల్లలూ కాదు, వాళ్ళేం చదివితే ఈ దేశంలోని పిల్లలందరూ అదే చదవటానికి. ధనవంతుల పిల్లలు ఏది చేస్తే అది పేదవాడికి అందించటానికి ధనవంతులు పిల్లలేమి ఆదర్శ జీవనం గడపట్లేదు.

“కోటీశ్వరుల పిల్లలు ఫారిన్ బ్రాండ్ మందు తాగుతుంటే పేదవాళ్ళు నాటు సారాతో సరిపెట్టుకోవాలా?”
“ధనవంతులు మాదక ద్రవ్యాలు తీసుకుని మత్తులో తూగుతుంటే, పేదవాళ్ళు మందుబిళ్లలతో తృప్తి చెందాలా?”
“ధనవంతుల పిల్లలు వరి అన్నం తిని, రోగాల్ని కొని తెచ్చుకుంటుంటే, పేదవాళ్ళు జొన్నన్నం తిని ఆరోగ్యంగా జీవించాలా?”
“ధనవంతులు ఒళ్ళుకదలకుండా కూర్చుని తింటుంటారు. పేదవాళ్ళు తినాలంటే మాత్రం కష్టించి పని చేయాలా?”.
“ధనవంతుల పిల్లలు ఇరుకు కార్పొరేట్ బడుల్లో బొటాబొటి క్వాలిఫికేషన్స్ ఉన్న టీచర్స్ పర్యవేక్షణలో ఖరీదైన చదువులు చదువుకుంటుంటే, పేదవాళ్ల పిల్లలు విశాలమైన ప్రభుత్వ బడుల్లో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ సమక్షంలో ఉచితంగా చదువుకోవాలా? పేదవాళ్ళు కార్పొరేట్ బడుల్లో చదువుకోకూడదా?”

ఇలాంటి ప్రశ్నలు సంధించేవారు పైకి సామాజిక న్యాయం కోసం, పేదల అభ్యున్నతి కోసం పోరాడుతున్నట్లు అనిపించినా, కొంచం ఆలోచిస్తే ఆ ‘సంఘసంస్కర్తలు’ నిజానికి సమాజాన్ని విచ్చిన్నం చేస్తున్నారని, అధోగతి పాల్జేస్తున్నారని, పేదల్ని మభ్యపెట్టి ఊబిలోకి లాగి, వారి జీవితాల్ని మరింత దుర్భరప్రాయం చేస్తున్నారని ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడే ఆ ‘సంఘసంస్కర్తలకు’ ఈ సత్యం తెలియక పోవచ్చు.

సమాజ శ్రేయస్సుని ఆశించే ఏ ప్రభుత్వం ఇలాంటి అసంబద్ధమైన, దిక్కుమాలిన కోరికలను సమర్ధించదు. సమాజం ఎలాగూ క్షీణిస్తుంది, రోజు రోజుకు అది దిగజారి పోతుంది, దాన్ని బహుశా ఆపలేం, కానీ ప్రభుత్వం పని కట్టుకుని వినాశనాన్ని ప్రోత్సహించకూడదు, కంచే చేను మేస్తే ఇక సమాజాన్ని ఎవరు కాపాడగలరు? ప్రభుత్వం నిర్ణయాలు శాస్త్రబద్ధంగా, హేతుబద్దంగా, సమాజహితంగా ఉండాలి, అంతే కానీ గుడ్డిగా కోటీశ్వరుల పిల్లలు పలానా పని చేస్తున్నారు కాబట్టి పేదవాళ్ల పిల్లలకు కూడా అది అందించాలనుకోవటం అవివేకం అవుతుంది.

చాలామంది ధనవంతుల ఇళ్లలో మరియు బాగా చదువుకున్న వాళ్ళ ఇళ్లలో, పిల్లలకు అమ్మలు పాలిచ్చి పెంచే పరిస్థితి లేదు. ధనవంతుల పిల్లలు డబ్బాపాలు తాగుతున్నారని, పేద పిల్లల్ని తల్లి పాలకి దూరం చేసి, వాళ్ళకి కూడా డబ్బాపాలు పట్టడం ఎంతవరకు వివేకం? పేదలకు డబ్బా పాల హక్కుని ప్రసాదించి, డబ్బా పాల కోసం ధనవంతులు కట్టే పన్నుల మీద ఆధారపడేలా చేయటం వలన పేదలను ఉద్దరించినట్లా లేక వాళ్ళని మరింత దిగజార్చినట్లా? మన మేధావులు ఆలోచిస్తే మంచిది.

మాతృభాషలో విద్యాబోధన పిల్లల మేధో వికాసానికి ఎంతో మంచిదని, పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించటానికి దోహదపడుతుందని పరిశోధనలు తేల్చి చెప్పాయి. శాస్త్రసాంకేతిక రంగాల్లో ముందున్న దేశాలన్నింటిలోనూ మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ కంటే చిన్న దేశాలు కూడా మాతృ భాషలో చదువుకుని అన్ని విధాలా ప్రగతి పథంలో ఉన్నాయి. ఉన్నత విద్య కూడా మాతృభాషలోనే కొనసాగిస్తున్నాయి.

కారణాలేవైనప్పటికీ మనదేశంలోని ధనవంతుల పిల్లలు మాతృభాషలో విద్యనభ్యసించలేక పోవటం వారి దురదృష్టం, అది వారి ఖర్మ. అందుకు వాళ్ళను చూసి జాలి పడతాం. అంతేకాని వాళ్ళని చూసి మిగతావాళ్ళు వాతలు పెట్టుకోవాల్సిన పనిలేదు. పేదరికం నుండి ఉన్నత స్థితికి ఎదిగిన మహానుభావులు, కోటీశ్వరులు మన సమాజంలో చాలా మంది ఉన్నారు, తెలుగు మాధ్యమంలో చదివి, సృజనాత్మకతతో, పట్టుదలతో, కష్టపడి ఉన్నత శిఖరాలకు ఎదిగిన అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకొని పేదపిల్లలు ఎదగటానికి ప్రయత్నం చేయవచ్చు. అంతేకానీ కోటీశ్వరుల పిల్లల్ని, మనుమలను ఆదర్శంగా తీసుకొని వాతలు పెట్టుకోవటం మంచిది కాదు.

ప్రభువులకు సమాజాభ్యుదయం మీద నిజంగా చిత్తశుద్ధి, స్పృహ ఉంటే, ఇంగ్లీషు మాధ్యమంలో చదివే కోటీశ్వరుల పిల్లలు కూడా తెలుగు బడుల్లో చదివేలా ప్రోత్సహించాలి. అందుకు అవసరైమైన చర్యలు తీసుకోవచ్చు. అది కోటీశ్వరుల పిల్లలకూ మంచిది, సమాజానికీ మంచిది. అంతేకాని ధనికులు ఆంగ్లమాధ్యమంలో చదువుతున్నారు కాబట్టి అదేదో గొప్పని భావించి, పిల్లల మనోవికాసం గురించి కనీస స్పృహ లేకుండా, పేదలకు కూడా తెలుగు మాధ్యమం అవకాశాన్ని దూరం చేయటం మన ప్రభువుల, మన ‘సంఘసంస్కర్తల’ అవివేకాన్ని చాటుతుంది.

ప్రజలు అమాయకులు, చాలా మందికి మంచీ చెడూ తెలియదు, ధనవంతుల విలాసాలు, రాక్షస కృత్యాలు చూసి అదే మంచిదని, గొప్పని భ్రమపడవచ్చు, తామూ ఆలా ఉండాలని ఉవ్విళ్ళూరవచ్చు. కానీ బాధ్యతాయుతమైన ప్రభువులు ప్రజలకు మంచీ చెడూ తెలియజేసే ప్రయత్నం చెయ్యాలి, ప్రజలకు, సమాజానికి నిజంగా ఏవి మంచివో, ఏవి ఉపయోగకరమో ఆ కార్యక్రమాలు చేపట్టాలి. అంతేకాని పేదవాళ్ళని మాయ మాటలతో మభ్యపెట్టకూడదు, అసంబద్ధమైన పోలికలతో రెచ్చగొట్టి, మనుషుల మధ్య లేనిపోని విభేదాలు సృష్టించకూడదు. వాళ్లలో అసంబద్ధమైన కోరికలు, లేనిపోని ఆశలు రేకెత్తించి, వాటికోసం ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకూడదు. అలాంటి చర్యలు వలన ప్రభువులు తాత్కాలికంగా అధికారాన్ని పదిలం చేసుకోగలుగుతారేమో కానీ సమాజం మాత్రం ఖచ్చితంగా విచ్చిన్నం అవుతుంది. అప్పుడు ప్రభువులు మొండి గోడల్ని, శిధిలాల్ని మాత్రమే పాలించగలుగుతారు.

వ్య్తకి ధర్మం వేరు, రాజధర్మం వేరు. ఆ రెండింటికి నక్కకి, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. మన నాయకులు, మేధావులు ఈ భేదాన్ని గ్రహించాలి. రాజ్యాంగపరంగా పౌరులకు కొంత స్వేచ్చ ఉంటుంది. కొన్ని విషయాల్లో వ్యక్తులు, వ్యక్తిగత స్థాయిలో తమకు నచ్చినట్లు నిర్ణయాలు చేయవచ్చు. ఆ నిర్ణయాలు వాళ్లకి మంచివి కాకపోయినప్పటికీ, వాళ్ళని ఎవరూ తప్పు బట్టడానికి లేదు, అలా అని అవి సమర్ధనీయమూ కాదు. కానీ పాలకులకు తమకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉండదు. పాలకులు ప్రభుత్వాన్ని నడిపేది ప్రజల డబ్బుతో, వాళ్ళ స్వంత డబ్బుతో కాదు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా సమాజహితంగా ఉండాలి, వాటికి శాస్త్రపరమైన ఆధారం ఉండాలి. అత్యధికులు కోరుకున్నంత మాత్రాన దానికి శాస్త్రబద్ధత రాదు, అది రాజ్యాంగపరంగా ఆమోదయోగ్యం కాదు. కేవలం ప్రజలందరూ ఇష్టపడుతున్నారు లేదా మోజు పడుతున్నారు కాబట్టి చేస్తామనడం రాజధర్మం కాదు. దివాళాకోరు రాజకీయం కిందకు వస్తుంది.

కుహనా మేధావులు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వేచ్చ వేరు, హక్కు వేరు. ప్రజలకు తమ పిల్లలని ప్రభుత్వ బడుల్లో కాకుండా కార్పొరేట్ పాఠశాలల్లో చదివించుకునే స్వేచ్చ ఉంది. అలానే తెలుగు మీడియంలో కాకుండా ఇంగ్లీషు మీడియంలో చదువుకునే స్వేచ్చ ఉంది. కానీ అవి ప్రజల హక్కులు కాదు. ఇంగ్లీషు మాధ్యమం అనేది ఒక హక్కుగా రూపుదిద్దుకోవాలంటే, ముందు తెలుగు మాధ్యమంలో చదువుకోవటం కంటే ఆంగ్లమాధ్యమంలో చదువుకోవటం తెలుగు ప్రజలకు, తెలుగు సమాజానికి ఎందుకు మంచిదో సహేతుకమైన వివరణ మరియు శాస్త్రపరంగా రుజువు చూపాల్సి ఉంటుంది. కేవలం ప్రజలు మోజు పడుతున్నారని, వాళ్లకి అసంబద్ధమైన హక్కులు కల్పించి ప్రభుత్వ వ్యవస్థని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు నాయకులకు లేదు.

తరువాత, ఇచ్చేవాడికి, పుచ్చుకునేవాడికి ఒకే ధర్మం ఉండదు. ఉండాలనుకోవటం అవివేకం. ఇది కొంచం కరుకుగా ఉన్నా ప్రజలందరూ అంగీకరించవలసిన నిజం. అన్నం పెట్టేవాడికి, అడుక్కొనేవాడికి ఒకే ధర్మం ఉంటే సమాజంలో అందరూ అడుక్కుతినే వాళ్ళే తయారవుతారు. కోటీశ్వరుడికి లోటస్ పాండ్ అంతటి ఇల్లు ఉంటే అడుక్కుతినే వాడికి ఎందుకుండకూడదు అంటూ దిక్కుమాలిన లాజిక్ వాడుతూ, కష్టించి పనిచేసి, స్వయంకృషితో, హుందాగా జీవించే ప్రజల్ని మభ్య పెట్టి, వాళ్లలో దాదాపు తొంభై శాతం మందిని ఇప్పుడు అడుక్కుతినే స్థాయికి దిగజార్చారు మన రాజకీయ నాయకులు. ఇకనైనా ఆపండి మీ రాక్షస రాజకీయాలు. ఇప్పటి వరకు మీరు చేసిన నీచ రాజకీయాల వలన వ్యక్తులు మాత్రమే దిగజారారు. ఇప్పుడు మీరు చేయబోయే దాని వల్ల జాతి జాతి నాశనమవుతుంది. కొంచమన్నా సమాజం మీద కరుణ, జాలి ఉంచండి

విద్యాబోధన యొక్క ప్రాధమిక లక్ష్యం పిల్లల మానసిక వికాసం పెంపొందించిండం మరియు వాళ్ళు ఆనందంగా, ప్రశాంతంగా జీవించటానికి కావాల్సిన జ్ఞానాన్ని అందించడం. అంతేకాని అందరినీ డాక్టర్లుగా, కలెక్టర్లుగా చేయడం కాదు లేదా అందరినీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా చేసి ఫ్లైట్లు ఎక్కించి అమెరికా పంపించడం కాదు. మంచి జ్ఞానం పొందిన వాడు పూరి గుడిసెలో కూడా ఆనందంగా జీవించగలుగుతాడు. బంట్రోతు అయినా తృప్తిగా జీవిస్తాడు. అది పొందలేని వాడు పెద్ద డాక్టరు అయినా, కలెక్టర్ అయినా ఆనందంగా జీవించలేడు. వాడికి ఎంత డబ్బు, హోదా, విలాసాలు సమకూరినా సంతృప్తిగా ఉండలేడు, ఇంకా కావాలని ఆరాటపడుతుంటాడు, పోటీ పడుతుంటాడు, సమాజాన్ని ఒత్తిడి చేస్తుంటాడు. పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇచ్చే విద్య కోసం పాటుపడతాం, వాళ్ళు మంచి జ్ఞానాన్ని పొందే హక్కుని కాపాడుదాం.

మేధావులారా ఆలోచించండి!

Post a comment or leave a trackback: Trackback URL.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.